జాబిల్లిపై మన ల్యాండర్, రోవర్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే.. తాజా ఫొటోలు విడుదల.....
0 Comments । By Black Cat News । 15 May, 2024
చంద్రయాన్ -3 మిషన్ లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విక్రమ్ ల్యాండర్ ను, అందులో ప్రగ్యాన్ రోవర్ ను జాబిల్లిపైకి పంపించిన విషయం తెలిసిందే. చంద్రుడిపై విజయవంతంగా దిగి విక్రమ్ ల్యాండర్ చరిత్ర సృష్టించింది. ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చి జాబిల్లి ఉపరితలం ఫొటోలను తీసి పంపించింది. చంద్రుడి ఉపరితలంపై నిర్ణీత ప్రదేశాన్ని చుట్టిరావడం కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది. దీంతో చంద్రయాన్ - 3 విజయవంతమైందని ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు. సుమారు పద్నాలుగు రోజుల పాటు విక్రమ్, ప్రగ్యాన్ లతో టచ్ లో ఉన్న ఇస్రో.. చంద్రుడిపై రాత్రి కాగానే వాటిని స్లీప్ మోడ్ లోకి పంపించింది. పక్షం రోజుల తర్వాత తిరిగి కాంటాక్ట్ అయ్యేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
జాబిల్లి ఉపరితలంపై రాత్రిపూట మైనస్ 200 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు పడిపోతాయని, దీంతో విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ ల లోపల అమర్చిన పలు పరికరాలు దెబ్బతిన్నాయని తెలిపారు. సూర్యరశ్మితో సోలార్ ప్యానెళ్ల ద్వారా వాటిని రీచార్జ్ చేసేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. అయితే, విక్రమ్, ప్రగ్యాన్ ల ప్రయోగం వెనక తమ లక్ష్యం జాబిల్లిపై సేఫ్ గా ల్యాండవడమేనని, రోవర్ తో చిన్నపాటి ప్రయోగాలను విజయవంతంగా చేశామని వివరించారు. దీంతో చంద్రయాన్ - 3 ప్రయోగ లక్ష్యం నెరవేరిందన్నారు. ఇస్రో విజయానికి గుర్తుగా అవి రెండూ చంద్రుడి ఉపరితలంపై ఎప్పటికీ ఉండిపోతాయని తెలిపారు.
తాజాగా విక్రమ్ ల్యాండర్ తో పాటు ప్రగ్యాన్ రోవర్ ను ఫొటోలు తీసినట్లు ఇస్రో వెల్లడించింది. గత నెల 15న అంతరిక్షంలో తిరుగుతున్న ఓ ఉపగ్రహం సాయంతో సుమారు 65 కిలోమీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసినట్లు తెలిపింది. ఈ ఫొటోలను గురువారం మీడియాకు రిలీజ్ చేసింది. తమకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తిచేసిన విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ లు జాబిల్లిపై శాశ్వతంగా రెస్ట్ తీసుకుంటున్నాయని క్యాప్షన్ జతచేసింది.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Chittoor