ఎన్నికల వేళ కాషాయరంగులోకి దూరదర్శన్ లోగో.. దుమ్మెత్తిపోస్తున్న విపక్షాలు.
0 Comments । By Black Cat News । 19 April, 2024
ఎన్నికల వేళ ప్రభుత్వ టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్ తన లోగో రంగును మార్చడం వివాదాస్పదమైంది. డీడీ న్యూస్ లోగోను ఎరుపు నుంచి కాషాయరంగులోకి మార్చింది. ఈ నెల 16 నుంచే మారిన లోగో చానల్‌లో కనిపిస్తోంది. లోగో రంగు మారినప్పటికీ తమ ప్రాధామ్యాల విషయంలో మాత్రం ఎలాంటి తేడా ఉండదని దూరదర్శన్ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా వార్తల ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని, డీడీ వార్తలను సరికొత్తగా అనుభవించాలని కోరింది. వేగంపై కచ్చితత్వం, క్లెయిమ్స్‌పై వాస్తవాలు, సంచలనాత్మక నిజాలకు సంబంధించిన వార్తల ప్రసారం విషయంలో తమకు ధైర్యం ఉందని పేర్కొంది. ఎందుకంటే డీడీ న్యూస్‌లో ప్రసారమైతే అది నిజమని ఆ పోస్టులో పేర్కొంది. అయితే, రంగుమార్పుపై విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ కాషాయీకరణ దూరదర్శన్‌కూ మారిందని దుమ్మెత్తిపోస్తున్నాయి.
దూరదర్శన్ ప్రస్తుతం ఆరు జాతీయ చానళ్లను, 17 ప్రాంతీయ చానళ్లను కలిగి ఉంది. నేషనల్ చానళ్లలో డీడీ నేషనల్, డీడీ ఇండియా, డీడీ కిసాన్, డీడీ స్పోర్ట్స్, డీడీ ఉర్దూ, డీడీ భారతి వంటి జాతీయ చానళ్లు.. డీడీ అరుణ్ ప్రభ, డీడీ బంగ్లా, డీడీ బీహార్, డీడీ చందన, డీడీ గిర్నార్, డీడీ మధ్యప్రదేశ్, డీడీ మలయాళం, డీడీ నార్త్ఈస్ట్, డీడీ ఒడిశా, డీడీ పొదిగై, డీడీ పంజాబ్, డీడీ రాజస్థాన్, డీడీ సహ్యగిరి, డీడీ సప్తగిరి, డీడీ ఉత్తరప్రదేశ్, డీడీ యాదగిరి, డీడీ కషీర్ వంటి ప్రాంతీయ చానళ్లు వున్నాయి.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Vishakhapatnam