ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో వజ్రాలపంట పండుతోంది. రైతులకు పొలాల్లో వజ్రాలు........
0 Comments । By Black Cat News । 24 July, 2023
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో వజ్రాలపంట పండుతోంది. రైతులకు పొలాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి. వారిని లక్షాధికారుల్ని చేస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా జి. ఎర్రగుడిలోని తుగ్గలిలో పొలం పనులు చేస్తుండగా ఓ రైతుకు వజ్రం దొరికింది.
ఈ విషయం తెలియడంతో స్థానిక వజ్రాల వ్యాపారులు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఇంటి దగ్గరే వేలం పాట పాడి ఆ వజ్రాన్ని రూ. 10లక్షలకు కొనుగోలు చేశారు. కాగా ఆ వజ్రం విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 16 లక్షలు ఉంటుందని అంచనా.
ఇదిలా ఉండగా, గత నెల కూడా ఓ రైతుకు రూ.2 కోట్ల విలువైన వజ్రం దొరికింది. యేటా ఏపీలోని రాయలసీమలో వజ్రాల వేట భారీగానే సాగుతుంది. తొలకరి వర్షాలు పడటం ప్రారంభం కాగానే చాలామంది పొలాల వెంట తిరుగుతూ వజ్రాల వేట సాగిస్తారు. ఈ సారీ స్థానికులు అలాగే చేశారు. ఈ వేటలో జూన్ మొదటి వారంలో కర్నూలు జిల్లాలో ఓ రైతుకు పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది.
అది కూడా తుగ్గలిలోనే కావడం గమనార్హం. తుగ్గలి మండలం బసనేపల్లిలో పొలం పనులు చేస్తుండగా ఓ రైతుకు వజ్రం దొరికింది. వెంటనే ఈ విషయం స్థానిక వ్యాపారులకు తెలిసింది.వారు వజ్రం కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. గుత్తికి చెందిన ఓ వ్యాపారి రూ. 2 కోట్లకు ఆ వజ్రాన్ని కొనుగోలు చేసినట్టుగా ప్రచారం సాగుతుంది.
ఈ సీజన్లో లభించిన అత్యంత విలువైన వజ్రం ఇదేనని చెబుతున్నారు. సాధారణంగా ఎక్కువగా లక్షల రూపాయలు విలువ చేసే వజ్రాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయని చెబుతారు. కానీ, రూ. 2 కోట్ల విలువైన వజ్రం లభించడం అరుదు అంటున్నారు స్థానికులు.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Kurnool