హైదరాబాద్ ఐఐటీ విద్యార్థిపై విశాఖలో లుక్ ఔట్ నోటీస్.. పోలీసుల దొరక్కుండా.....
0 Comments । By Black Cat News । 26 July, 2023
హైదరాబాద్‌లో ఐఐటీ చదువుతున్న దనావత్ కార్తిక్ నాయక్ ఈ నెల 17న సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి క్యాంపస్ నుంచి అదృశ్యం అయ్యాడు. రెండు రోజుల పాటు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చి ఐఐటి హాస్టల్ వార్డెన్ గోపీనాథ్ కు ఫోన్ చేశారు. వెంటనే హాస్టల్ లో తనిఖీ లు చేయగా ఎక్కడా కనపడలేదు. సహా విద్యార్థులను విచారిస్తే సమీపంలో ఉన్న డాబా లో ఉన్నట్టు చెప్పాడని, 20 రూపాయలు డబ్బులు కావాలని అడిగినట్టు ఒక రూం మేట్ చెప్పారు. అక్కడకు వెళ్లి చూస్తే అక్కడా కనపడలేదు. మొబైల్ ను మాత్రం అవసరం వచ్చినప్పుడు చూస్తున్నాడు, మిగతా సమయాల్లో ఆఫ్ చేసి ఉంటున్నాడు. దీంతో కంగారు పడ్డ తల్లితండ్రులు 19 వ తేదీ ఐఐటీ కళాశాల కు వచ్చి ఫిర్యాదు చేయడం తో హాస్టల్ వార్డెన్ స్థానిక కంది పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేశాడు.
తర్వాత విచారణ చేపట్టిన పోలీసులకు 20 వ తేదీ ఉదయం జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కి సాయంత్రానికి విశాఖ చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీస్ సిబ్బంది ని వెంటబెట్టుకుని తల్లితండ్రులు ఉమా నాయక్ దంపతులు విశాఖ చేరుకున్నారు. కొడుకు ను చూడాలని, అసలు ఎందుకు పారిపోయాడో తెలుసుకుని దాన్ని పరిష్కరించాలని కంటి నిండా నీరు పెట్టుకుని తల్లడిల్లిపోతున్నారు తల్లితండ్రులు.
పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న కార్తిక్
20 వ తేదీ విశాఖ వచ్చిన ఐఐటీ విద్యార్ధి కార్తిక్ నాయక్ రాత్రి పూట ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడో తెలీదు కానీ పగలు మాత్రం అప్పుడప్పుడు మొబైల్ ఆన్ చేసి తన తండ్రి బ్యాంక్ అకౌంట్స్ ను నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఏదైనా కావాల్సిన తిండి పదార్థాలు కొనుక్కుని బిల్ కట్టి వెంటనే ఫోన్ ఆపేసేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ట్రాక్ చేసున్న సంగారెడ్డి పోలీస్ కు వెంటనే బిల్ కడుతున్న బేకరీ, రెస్టారెంట్ లకు వెళ్తున్నా అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతున్నాడు కార్తీక్. ఆ విధంగా సీసీ కెమెరాలు ఆధారంగా దర్యాప్తు చేయగా ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ నుంచి కొద్దీ నిమిషాల వ్యవధిలోనే మిస్స్ అవుతున్నట్టు గుర్తించారు.
రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బేకరి షాప్, ఉడా పార్క్ వద్ద సంచరిస్తున్నట్టు సిసి కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు పోలీసులకు లభించాయి. బీచ్ రోడ్డు లో కూడా తిరిగినట్టు ఆధారాలు సేకరించారు పోలీసులు. నిన్న తాజాగా దువ్వాడ లో ఉన్నట్టు కూడా గుర్తించి అక్కడకు వెళ్ళే లోపు వెళ్ళిపోయాడు. సంగారెడ్డి పోలీసులకు స్థానిక విశాఖ పోలీసులు సహకారం అందిస్తున్నారు. దీంతో విమానయానం ద్వారా వెళ్తారాన్న ఉద్దేశంతో లుక్ ఔట్ నోటీస్ లు జారీ చేసి విశాఖ నగరాన్ని జల్లెడ పడుతున్నారు
ఒత్తిడి భరించలేకనేనా?
అయితే ఐఐటి క్యాంపస్ నుంచి పారిపోయి వచ్చేయడం పై కారణాలను కూడా మరోవైపు పోలీసులు అన్వేషిస్తూ ఉన్నారు. స్థానికంగా విద్యార్థులతో ఏమైనా గొడవలు ఉన్నాయా? ఇంటి దగ్గర సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇతర కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఎలాంటి సమస్యలు లేవని తల్లితండ్రులు చెబుతుండటం తో ఏమై ఉంటుందా అన్న రీతిలోనూ విచారణ జరుగుతోంది. లేక ఐఐటి కోర్స్ ఒత్తిడి భరించలేక , చదవడం ఇష్టం లేక, ఆ క్యాంపస్‌లో ఉండడంపై ఆసక్తి లేక వెళ్ళిపోయాడా ఆన్న దానిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారట.
మరోవైపు తల్లితండ్రులు కూడా విశాఖ లోనే ఉంటూ కొడుకు ఆచూకీ కోసం చేస్తున్న ప్రయత్నాలు అందరినీ వేదనకు గురి చేస్తున్నాయి. విశాఖ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం తో త్వరలోనే కార్తీక్ నాయక్ ఆచూకీ లభించే అవకాశం ఉంటుందని ఆశిద్దాం.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Vishakhapatnam