ఎల్లలు దాటిన ప్రేమ.. ఫేస్‌బుక్‌లో ప్రేమ.. శ్రీలంక నుంచి ఏపీకి వచ్చిన యువతి.
0 Comments । By Black Cat News । 3 August, 2023
ఇటీవల దేశాలు, ఖండాంతరాలు దాటుతున్న ప్రేమ కథలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమకు ఎల్లలు లేవని ప్రేమికులు నిరూపిస్తున్నారు. ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్ మొబైల్ గేమ్ ద్వారా పరిచయమై మన దేశానికి చెందిన యువకుడి కోసం నలుగురు పిల్లలతో కలిసి వచ్చి వార్తల్లో నిలిచింది. అలాగే రాజస్థాన్‌కు చెందిన ఓ వివాహిత ప్రేమించిన యువకుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లింది. దేశాలు సరిహద్దులు దాటి తమ ప్రేమను గెలిపించుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన చిత్తూరు జిల్లాలోనూ వెలుగు చూసింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడి కోసం ఓ యువతి శ్రీలంక నుంచి వచ్చింది. ప్రస్తుతం తన ప్రియుడిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటోంది. పూర్తి వివరాలు ఇలా..
చిత్తూరు జిల్లా వి.కోట మండలం ఆరిమాకులపల్లె గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడికి శ్రీలంక దేశంలోని బేలంగూడు ప్రాంతానికి చెందిన విఘ్నేశ్వరికి అనే యువతితో ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. ఫేస్‌బుక్ చాటింగ్ తరువాత ప్రేమగా మారింది. ఏడేళ్లుగా ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన టూరిస్ట్ వీసాపై విఘ్నేశ్వరి చెన్నై నగరానికి వచ్చింది.
తన ప్రియురాలిని లక్ష్మణ్ ఇంటికి తీసుకువచ్చాడు. ఈ నెల 20వ తేదీన పెద్దల సమక్షంలో ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం విఘ్నేశ్వరి లక్ష్మణ్ కుటుంబ సభ్యులతోనే కలిసి ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. శుక్రవారం లక్ష్మణ్ నివాసం వద్దకు వచ్చారు. విఘ్నేశ్వరి వీసాను పరిశీలించారు. ఆమె వీసా గడువు ఆగస్టు 6వ తేదీ వరకు గడువు ఉంది.
ఆ తేదీలోగా శ్రీలంక వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చారు. తనకు ఇక్కడే ఉండాలని ఉందని.. తన వీసా గడువు పొడగించాలని శ్రీలంక యువతి కోరుతోంది. ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని.. యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించాలని లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు పోలీసులు సూచించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మూడు రోజుల కిందట వారిని చిత్తూరుకు పిలిచించినట్లు తెలిసింది. వి.కోట మండలంలో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. విఘ్నేశ్వరి వీసా గడువు పొడగిస్తారా..? లేదా ఆమె స్వదేశానికి వెళ్లిపోతుందా..? అని చర్చనీయాంశంగా మారింది.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Chittoor