సంతానం కోసం ఏడేళ్లుగా భార్యను వేధించి, చివరకు...........
0 Comments । By Black Cat News । 28 July, 2023
పెళ్లయి ఏళ్ల గడుస్తున్నా సంతానం కలగక పోవడంతో కట్టుకున్న భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేయడంతో మనస్తాపానికి గురైన గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడైన భర్తకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ సీనియర్ సివిల్ జడ్జి అరుణశ్రీ తీర్పు చెప్పారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేచలపు వెంకటరావు, హుకుంపేట ఎస్‌ఐ సతీష్ వేర్వేరుగా తెలిపిన వివరాలివి.
హుకుంపేటకు చెందిన పడమట మాధవికి లక్ష్మణరావుతో అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నక్కలపాలెంలో 2015 మే 5వ తేదీన వివాహం జరిగింది. కొన్నేళ్లు వారి కాపురం సజావుగానే సాగింది. అయితే సంతానం కలగకపోవడంతో భర్తతో పాటు కుటుంబ సభ్యుల నుంచి మాధవికి వేధింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2021 ఫిబ్రవరి 9న భర్త, కుటుంబ సభ్యుల వేధింపులకు తట్టుకోలేక హుకుంపేటలోని తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన మాధవి ఉరి వేసుకుని మృతి చెందింది. దీంతో మాధవి భర్త పడమట లక్ష్మణరావు, మామ తిరుపతి గుప్తా, అత్త కన్నాకుమారి, చిన మామ సత్యనారాయణ, వారి బంధువు ఉడా శ్రీనివాసరావులు ప్రతి రోజు తన కుమార్తె మాధవిని గొడ్రాలివని, నువ్వు వెళ్లిపోతే భర్త లక్ష్మణరావుకు వేరే వివాహం చేస్తామని వేధింపులకు పాల్పడడం వల్లే తన కుమార్తె మృతి చెందిందని మృతురాలి తండ్రి కామరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పాడేరు సీఐ సుధాకర్ కేసు దర్యాప్తు నిర్వహించి నిందితులు ఐదుగురిపై ఐపీసీ 306,498ఎ రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కోర్టులో ఛార్జిషీట్ ఫైల్ చేశారు. కోర్టులో విచారణ అనంతరం ప్రధాన నిందితుడు మృతురాలి భర్త లక్ష్మణరావుకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రెండు వేలు నగదు జరిమాన విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా రెండు వారాల జైలు శిక్షను విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. ఇతర నిందితులపై మోపిన నేరం రుజువు కానందున వారిని నిర్దోషులుగా పేర్కొంటూ వారికి విముక్తి కలిగించారు.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Vishakhapatnam